శ్రీకాళహస్తిలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరాయుడు మృతితో సంచలనం రేపిన కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. జనసేన మాజీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ కోటా వినూత మాజీ వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసరాయుడు చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతుడిగా కనిపించిన తర్వాత ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతడి చేతిపై ‘కోటా వినూత’ అని పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను ఎవరో గుర్తించిన పోలీసులు, వెంటనే దర్యాప్తును ప్రారంభించారు.

ఈ కేసులో విచారణను ముందుకు తీసుకెళ్లిన పోలీసులు, అనుమానాస్పదంగా కోటా వినూత మరియు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసులో మరికొంతమంది నిందితుల పేర్లు వెలుగులోకి రావడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో ఒక్కొక్కరుగా బయటపడుతున్న వివరాలు, ఈ కేసు ఎంత సంక్లిష్టమో స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు ఒక్కో కీలక ట్విస్ట్ బయటపడుతోంది. ఒక అంశాన్ని విశ్లేషిస్తున్నంతలో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది.
పలువురు మీడియా సంస్థలు వెల్లడించిన కథనాల ప్రకారం, శ్రీనివాసరాయుడు కోటా వినూతతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఆమె పడకగదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడట. ఆ కెమెరాల ద్వారా వినూత, ఆమె భర్త మధ్య వ్యక్తిగత దృశ్యాలను రికార్డు చేశాడని ఆమె తెలిపినట్టు వార్తలు చెబుతున్నాయి. అనంతరం వాటిని 30 లక్షల రూపాయలకు ప్రత్యర్థి పార్టీకి విక్రయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా అతడి హత్య జరిగిందని పలువురు అనుమానిస్తున్నారు.
అయితే, ఇక్కడే అసలు మలుపు మొదలవుతోంది. కోటా వినూత చెప్పిన కథనాలను పక్కన పెడితే, శ్రీనివాసరాయుడు ఆమె పడకగదికి ఎలా ప్రవేశించాడు? ఒక డ్రైవర్‌కు ఆ స్థాయిలో నమ్మకాన్ని ఎలా కల్పించారు? ఆ గదిలోకి వెళ్లడానికి సాధారణంగా కుటుంబ సభ్యులకే అవకాశం ఉండదు. అలాంటి ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆమె మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా, అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక డ్రైవర్, తన యజమానిని పచ్చబొట్టు వేయించుకునేంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?
ఇంతలో శ్రీనివాసరాయుడుతో వినూత దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. కొన్ని పార్టీ నేతలు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు, శ్రీనివాసరాయుడు మృతికి సంబంధించి అతడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. అతడి నానమ్మ మీడియాతో మాట్లాడుతూ, “ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి ముందే తెలుసు. నా మనవడి ప్రాణాలు కాపాడమన్నాం, కానీ పట్టించుకోలేదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో సీక్రెట్ కెమెరాలు, వ్యక్తిగత వీడియోలు, డబ్బు లావాదేవీలు, రాజకీయ సంబంధాలు అన్నీ కలిసిపోయి విచారణను మరింత సంక్లిష్టంగా మార్చేశాయి. పోలీసులకు ఇది గందరగోళంగా మారిన కేసుగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే – ఈ చీకటి మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుంది? అసలైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది?































