ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా భువనేశ్వరి గురించి వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబునాయుడు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ ఘటన గురించి ఎంతో మంది సినీ హీరోలు టిడిపి అభిమానులు స్పందించి నారా భువనేశ్వరికి మద్దతు తెలిపారు.

ఇకపోతే ఈ విషయంపై నారా భువనేశ్వరి స్పందించారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ శాసనసభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత తనకు ఎంతోమంది అండగా నిలబడ్డారని ఇలా తనకు మద్దతు తెలిపిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాకు అవమానం జరిగితే సొంత తల్లికి, తోబుట్టువుకి జరిగిన విధంగా భావించి నాకోసం అండగా నిలిచారని ఈమె వెల్లడించారు.
చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రులు తమని విలువలతో క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అదే విలువలను పాటిస్తున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కష్టాలు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలని ఈమె ప్రజలకు సూచించారు.

ఇకపోతే ఒక వ్యక్తి ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదని, నేడు తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకుండా ఉండాలని ఆమె ఆశిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇలా భువనేశ్వరి అసెంబ్లీ ఘటన గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

































