ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న కుక్క.. ఎక్కడంటే..?

0
148

ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. కరోనా తొలి కేసు నమోదైన రోజు నుంచి ఈ వైరస్ బారిన పడిన వారిని రక్షించడానికి వైద్య రంగంలో పని చేసేవాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా బాధితులకు చికిత్స చేస్తున్నారు. విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తూ కొందరు వైద్యులు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు.

చికిత్స అందించిన తరువాత ఇంటికి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ నుంచి వైద్యులు వాళ్లను వాళ్లు రక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే అమెరికాలోని ఒక ఆస్పత్రి వైద్యులు రోజురోజుకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఓహాయో రాష్ట్రంలోని స్టేట్ యూనివర్సిటీకి చెందిన వెస్క్ నర్ మెడికల్ సెంటర్ వైద్యులు ఒక కుక్కకు ఉద్యోగం ఇచ్చారు.

కుక్కకు, ఒత్తిడిని తగ్గించడానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? సాధారణాంగా పెంపుడు జంతువులను పెంచుకోవడం ద్వారా సులభంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక నిపుణులు సైతం పెంపుడు జంతువులు ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అందువల్ల వైద్యులు కుక్కకు ఉద్యోగం ఇవ్వగా ఆ కుక్క ఆస్పత్రి అంతా తిరుగుతూ ఉంటుంది.

వైద్యులకు, సిబ్బందికి ఒత్తిడిని తగ్గిస్తున్న ఆ కుక్కకు భోజం, ప్రత్యేక గది ఉండటంతో పాటు ఐడీ కార్డ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఆ కుక్క జీతం తీసుకోకుండానే విధులు నిర్వహిస్తోంది. ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో కుక్క ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.