దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్ల ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రోడ్డుపై అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు.

ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలపై ఆయన తీవ్ర అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం లీటర్ పెట్రోల్ కేవలం 40 రూపాయలకే ఇవ్వడం సాధ్యమవుతుందని వెల్లడించారు. సాధారణంగా లీటర్ పెట్రోల్ 30 రూపాయలకు ఇవ్వవచ్చని అదనపు ఖర్చులు, ట్యాక్సులతో కలిపి 40 రూపాయలకు ఇవ్వవచ్చని అన్నారు.
తన అభిప్రాయం ప్రకారం గరిష్టంగా 40 రూపాయలకు అమ్మితే సరిపోతుందని అంతకు మించి అమ్మకూడదని అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పింది కరెక్ట్ అని ఇతర దేశాల్లా భారత్ లో సైతం పెట్రోల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరిగితే రూపాయల్లో పెరుగుతున్నాయని.. తగ్గితే మాత్రం పైసల్లో తగ్గుతున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 80 రూపాయలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.































