తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మానవత్వం లేని ఒక దయనీయమైన సంఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

తోపుడు బండిపై అంబులెన్స్ ప్రయాణం
కోస్గి పట్టణానికి చెందిన 28 ఏళ్ల మొగులయ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల పోలిసులు ఒక చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని తీసుకుని మృతదేహాన్ని తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించుకోవడానికి వచ్చిన ఆ చిరువ్యాపారికి అనుమతి కూడా తీసుకోకుండా ఈ పని చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేవా?
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు కనీస ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనం సమకూర్చలేకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబులెన్స్ లేని కారణంగా తోపుడు బండిలో మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంబులెన్స్ లేక తోపుడు బండిపై మృతదేహం తరలింపు!
— TeluguDesk (@telugudesk) August 18, 2025
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మొగులయ్య (28) బైక్‌పై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… pic.twitter.com/stdZka6VoL































