కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో ఆఫ్ లైన్ క్లాసులంటే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు బోధన జరిగేలా చేస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత దేశంలో గతంతో పోల్చి చూస్తే ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులు మొబైల్ డేటా కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో తమిళనాడు సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వేర్వేరు కాలేజీలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సీఎం పళనిస్వామి విద్యార్థులకు ఉచిత డేటా కార్డు ఇస్తామని ప్రకటించారు.

విద్యార్థులు ఆన్ లైన్ తరగతులను వినేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పళనిస్వామి చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు విద్యార్థులకు రోజుకు 2జీబీ చొప్పున ఉచితంగా డేటా అందనుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ఈ డేటా కార్డులను అందజేయనుందని తెలుస్తోంది.

ఇంటర్నెట్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల పేద విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయం తమిళనాడు సర్కార్ దృష్టికి రావడంతో సీఎం పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here