ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని ప్రతీ అవయవం బాగుండాలి. అలా ఉండాలంటే ప్రతీరోజు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయమం చేస్తే మేలు కలుగుతుంది. అయితే ముఖ్యంగా గుండెకు సంబంధించి వ్యాధులు ఏవైనా వచ్చాయంటే.. ప్రమాదకరమనే చెప్పాలి. గుండె కొట్టుకోవడం ఒక్క నిమిషం ఆగిన ప్రాణం పోతుంది.

అలాంటి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవితాంతం యంగ్ హార్ట్ మీ సొంతమవుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకునేది దేని గురించి అంటే.. వంకాయ. ఆహా ఏమి రుచి.. తిందాం మైమరిచి అనే సాంగ్ అందరూ వినే ఉంటారు.
అలా ఉంటుంది మరి వంకాయ కూర. అయితే దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వంకాయలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం మొదలైన పోషకాలు అధికంగా ఉన్నాయి. తద్వరా గుండె ఆరోగ్యం నుండి ఊబకాయం వరకు అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది.
వంకాయలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది జీర్ణక్రియ, చక్కెర శోషణ రేటును తగ్గిస్తుంది. చక్కెర నెమ్మదిగా శోషణ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. ఇలా రోజూ వారి ఆహారంలో వంకాయను తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడంతో పాటు గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలకు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.