అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. తక్షణ శక్తిని అందించే ఈ పండులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది రోజూ అరటిపండు తీసుకుంటుంటారు. అయితే దీనిని తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం అరటిపండులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి సమయంలో వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని సూచిస్తున్నారు.
ముఖ్యంగా చల్లటి నీరు తాగడం వల్ల కొందరికి గొంతు సమస్యలు, దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో శ్లేష్మం పెరగడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తవచ్చని వివరిస్తున్నారు.
అరటిపండు తిన్న వెంటనే నీరు తాగితే శరీరం ఆ పండులోని పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. అందుకే అరటిపండు తిన్న తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఇచ్చి నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా వాటిని సరైన విధంగా తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆహారపు అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



























