దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పాల ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పాల ధర 50 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఏపీలోని ఆ గ్రామాల్లో మాత్రం పాలు ఉచితంగా పోస్తారు. వినడానికి వింతగానే అనిపించినా దాదాపు 4 శతాబ్దాల నుంచి ఆ గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో పాలకు డబ్బు ఇస్తామంటే మాత్రం చుక్క పాలు కూడా పోయరు.

అలా కాకుండా పాలు కావాలని అడిగితే ఇష్టంగా పోస్తారు. పాలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు తమకు వద్దని ఆ డబ్బు వల్ల పాడైపోతామని గ్రామస్తులు చెబుతుండటం గమనార్హం. ఇలా పాలు ఉచితంగా పోసే వింత గ్రామాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. జిల్లాలోని గంజహళ్లిలో వందల సంఖ్యలో పశువులు ఉన్నాయి. ఆ పశువులు ఇచ్చే పాలలో ఇంటి అవసరాల మేరకు పాలను వినియోగించుకుని మిగిలిన పాలను ఇతరులకు ఇస్తారు.

కడిమెట్ల గ్రామంలో కూడా పాలు ఇతరులకు ఫ్రీగా ఇస్తారే తప్ప డబ్బులు తీసుకోరు. ఇలా ఈ రెండు గ్రామాల ప్రజలు పాలు అమ్మకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. 4 శతాబ్దాల క్రితం గంజహళ్లి గ్రామంలో పశువులు అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాయి. కొన్ని పశువులు చనిపోయాయి. ఆ సమయంలో ఆ ఊరిలో ఉండే బడేసాబ్ తాత కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ ను పాలు తీసుకురావాలని ఊరిలోకి పంపించాడు.

అయితే పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో ఎవరూ పాలు పోయలేదు. దీంతో హుస్సేన్ సాహెబ్ చివరకు గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి పాలు కావాలని కోరగా గ్రామ పెద్ద తమ ఆవు చనిపోయిందని.. ఆవు కళేబరం మారెమ్మ ఆలయం దగ్గర పడేశామని చెప్పాడు. హుస్సేన్ సాహెబ్ ఆ గుడి దగ్గరకు వెళ్లి దేవతను ప్రార్థించగా చనిపోయిన ఆవు లేచి పాలు ఇచ్చింది. అనంతరం బడే సాబ్ గ్రామస్తులకు పాలు అమ్మకూడదని, పశుగ్రాసాన్ని తగులబెట్టకూడదని, పశువులను చంపకూడదని సూచించగా అదే ఆచారాన్ని నేటికీ గ్రామస్తులు అనుసరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here