మనలో చాలామందికి ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంచనాలకు అందని స్థాయిలో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పలు సందర్భాల్లో భారీగా వచ్చిన కరెంట్ బిల్లులను చూసి తలలు పట్టుకుంటున్నారు. చాలామంది గత నెలలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చిందని ఈ నెలలో మాత్రం అంచనాలను మించి వచ్చిందని చెబుతూ ఉంటారు.

అయితే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తే గాబరా పడవద్దని.. కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా సులభంగా కరెంట్ బిల్లును తగ్గించుకోవడం సాధ్యమవుతుందని తెలుపుతున్నారు. కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే మొదట మనం ఇంట్లో ఎక్కువగా వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువులపై దృష్టి పెట్టాలని.. అలా చేయడం ద్వారా మనం అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించి ఆదా చేయవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ విద్యుత్ వినియోగానికి కారణమయ్యే ఫ్రిజ్, గీజర్, ఒవెన్, ఏసీలను వాడే తీరు గురించి దృష్టి సారించాలని అధికారులు తెలుపుతున్నారు. శ్లాబ్ మారడం వల్లే చాలా సందర్భాల్లో కరెంట్ బిల్ పెరుగుతుందని.. ఎలక్ట్రానిక్ వస్తువులను క్రమపద్ధతిలో వాడితే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. గీజర్ ను ఒకేసారి ఆన్ చేసుకుని వినియోగించుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని తెలుపుతున్నారు.
ఏసీని వాతావరణానికి అనుకూలంగా పెట్టుకోవాలని.. తక్కువ ఉష్ణోగ్రత లోపెడితే కరెంట్ బిల్లు పెరుగుతుందని తెలుపుతున్నారు. గోడకు, ఫ్రిజ్ ఉంచే ప్రదేశానికి మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని.. వాషింగ్ మెషీన్ లో లోడ్ కు మించి బట్టలు వేయవద్దని సూచిస్తున్నారు. చిన్నచిన్న వంటలకు ఓవెన్ ను వినియోగించకపోతేనే మంచిదని తెలుపుతున్నారు.































