గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాట్లాడుతూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమ్మాయిల కనీస వివాహ వయస్సు గురించి కమిటీని నియమించామని.. కమిటీ నివేదిక అందిన వెంటనే యువతుల వివాహ వయస్సు గురించి నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.

మోదీ సర్కార్ ప్రస్తుతం 18 సంవత్సరాలుగా ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని అనేక వర్గాల నుంచి కనీస వివాహ వయస్సును సమీక్షించాలని అనేక వినతులు వచ్చినట్టు మోదీ తెలిపారు. బీజేపీ సర్కార్ చేపట్టిన కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలురుతో పోలిస్తే బాలికల సంఖ్య భారీగా పెరిగిందని మోదీ వెల్లడించారు.

ఐక్యరాజ్యసమితి అనుబంధ వ్యవసాయ ఆహార సంస్థ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ సేవలను ప్రశంసిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా మోదీ 75 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మోదీ అమ్మాయిల పెళ్లి వయస్సు గురించి ప్రస్తావించారు. అమ్మాయిలకు రూపాయికి శానిటరీ ప్యాడ్ లను అందజేస్తున్నామని అన్నారు.

యువతుల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే ఉండటం వల్ల తల్లిదండ్రులు 18 ఏండ్ల వయస్సులోనే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారని.. ఫలితంగా యువతుల ఆకాంక్షలు నెరవేరడం లేదని సమాచారం. చిన్న వయస్సులో కుటుంబ భారాన్ని మోయడం వల్ల అమ్మాయిలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్రం ఈ తరహా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here