ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా రోజురోజుకు కేసులు పెరగడంతో సరైన మౌలిక వసతులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు.

ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే సోనుసూద్ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. సోనూసూద్ బాటలోనే మరికొంత మంది హీరోలు ఫాలో అవుతూ తమ వంతు సాయంగా వారికి తోచిన సహాయం చేస్తూ బాధితులను ఆదుకున్నారు. తాజాగా సందీప్ కిషన్ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివించే బాధ్యత తీసుకున్నారు. అదే విధంగా తాజాగా హీరో అడివి శేష్ తన వంతు సహాయంగా హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి కోసం వాటర్ ప్లాంట్ డొనేట్ చేసారు.
కోటి ప్రభుత్వ హాస్పిటల్‌లో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉండటంతో ఇక్కడికి వచ్చే రోగులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అడివి శేష్ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 865 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ప్లాంట్‌ను హాస్పటల్‌లో అరెంజ్ చేసారు. ఈ వాటర్ ప్లాంట్ 1000 లీటర్ల తాగునీటిని శుద్ది చేస్తుంది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున హీరో అడివి శేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే అడివి శేష్ 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న “మేజర్ ” చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


































