ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు వరుస శుభవార్తలు చెబుతోంది. రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతుభరోసా, వైయస్సార్ జలకళ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో శుభవార్త ద్వారా రైతులకు మేలు చేకూరేలా చేస్తోంది. జగన్ సర్కార్ ఖరీఫ్ పంటలకు కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తోంది.
రైతులు ఈ బీమా పొందడానికి అర్హులు కావాలంటే ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) 101 కోట్ల రూపాయల వాటా ధనంతో రైతులు నమోదు చేసుకున్న పంటలకు బీమాను అమలు చేయనుంది. గతేడాది గుర్తించిన ఉద్యాన పంటలతో పాటు వ్యవసాయ పంటలకు కూడా ఈ బీమా అమలు కానుంది. జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (జీసీఈఎస్) ద్వారా ప్రభుత్వం ఈ పంట కోత ప్రయోగాల ను బట్టి క్లెయిమ్స్ ను పరిష్కరించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్లు, ఐఎండీ వాతావరణ కేంద్రాలు వాతావరణ ఆధారిత పంటల బీమా పథాకానికి సంబంధించిన క్లెయిమ్స్ ను పరిష్కరించడంలో సహాయపడతాయి. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రైతుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉండటం గమనార్హం.
మరోవైపు ఈ ఏడాది వర్షాలు కూడా కురవడంతో రైతులకు పంటలు బాగా పండుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అందజేయడంతో పాటు గిట్టుబాటు ధరలకు ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది