తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు వెయిటేజీ మార్కులను తొలగిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు కరోనా, లాక్ డౌన్ కారణంగా సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయినట్టు ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. అనంతరం పాస్ మార్కులతో సంబంధం లేకుండా ఫలితాలను వెల్లడించింది.

అయితే ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా వెయిటేజీ మార్కులను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం జేఎన్టీయూను రెండో విడత కౌన్సిలింగ్ ఆపేయాలని ఆదేశాలు జారీ చేయగా తెలంగాణ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ నిబంధనలను సవరించింది.

మారిన నిబంధనల వల్ల ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. గత కొన్ని రోజుల నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్ వెయిటేజీ తొలగిస్తారంటూ వార్తలు వెలువడగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి.

ప్రభుత్వం తాజా నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో టెన్షన్ పడుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఊరట కలిగిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here