హైబీపీ లేదా అధిక రక్తపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ఇప్పుడు యువతలో కూడా ఎక్కువవుతోంది. ముఖ్యంగా హైబీపీకి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో దీనిని “సైలెంట్ కిల్లర్”గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ మందులపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే రక్తపోటును సహజంగానే నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.

అధిక ఉప్పు వినియోగం హైబీపీకి ప్రధాన కారణాల్లో ఒకటి. మనం రోజూ తీసుకునే ఆహారంలో సోడియం మోతాదు ఎక్కువైతే రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, అధిక ఉప్పు ఉన్న వంటకాలను తగ్గించడం ద్వారా బీపీ స్థాయిల్లో మార్పు కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి వంటల్లో కూడా ఉప్పు పరిమితంగా వాడటం మంచిదని సూచిస్తున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం కూడా రక్తపోటును పెంచే ప్రధాన కారణం. ప్రతిరోజూ కనీసం అరగంట నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే గుండె పనితీరు మెరుగుపడుతుంది. వ్యాయామం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో బీపీ సహజంగానే నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
అధిక బరువు ఉన్నవారిలో హైబీపీ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. బరువు కొద్దిగా తగ్గినా గుండెపై పడే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే సమతుల ఆహారం, సరైన వ్యాయామం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధిక నూనె, జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలను తగ్గించడం కూడా అవసరమని చెబుతున్నారు.
ఒత్తిడి, నిద్రలేమి కూడా రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరంతరం టెన్షన్‌లో ఉండటం వల్ల శరీరంలోని హార్మోన్లు అసమతుల్యంగా మారి బీపీ పెరుగుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవడం, ధ్యానం లేదా రిలాక్సేషన్ పద్ధతులు పాటించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మద్యం, ధూమపానం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి రక్తనాళాలను బలహీనపరచి బీపీని పెంచుతాయి. అలాంటి అలవాట్లను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఇప్పటికే తీవ్రమైన హైబీపీతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా మందులు ఆపకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు ప్రారంభ దశల్లో ఎంతో ఉపయోగపడతాయి. క్రమశిక్షణతో మంచి ఆహారం, వ్యాయామం, సరైన నిద్రను అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.































