చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆ దేశ ప్రభుత్వం భావించి గతంలో మాస్కులు సైతం వినియోగించాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చైనాలోని కింగ్ డావో నగరంలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులు ఆ నగరంలోని ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కింగ్ డావ్ లోని ఆసుపత్రి కరోనా వైరస్ కు క్లస్టర్ గా మారింది. ఆస్పత్రిలోని సీటీ రూంలో డిస్ ఇన్ ఫెక్షన్ సరిగ్గా చేయకపోవడంతో అక్కడ కోటి మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. చైనా ప్రభుత్వం ఇప్పటికే ఆ ఆస్పత్రి డీన్ ను తొలగించడంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. చైనా ప్రభుత్వం ఐదు రోజుల్లో కోటి మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి ఎంతమంది వైరస్ సోకిందో గుర్తించాలని పేర్కొంది.

ఇప్పటికే అక్కడ లక్షల సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏ ఒక్కరికీ వైరస్ నిర్ధారణ కాలేదు. కింగ్ డావో నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గతంలో బీజింగ్ లోని ఒక ఫుడ్ మార్కెట్ లో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో వేల సంఖ్యలో కరోనా పరీక్షలు జరిపి అధికారులు వైరస్ ను కట్టడి చేశారు. ప్రస్తుతం కింగ్ డావో నగరంలో కోటి మందికి కరోనా పరీక్షలు జరపడం ఆ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

మరోవైపు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ దేశంలో నిన్న ఒక్కరోజే 24 కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్టు వెల్లడించింది. అయితే ఈ కేసులన్నీ బయట దేశాల నుంచి వచ్చిన వారిలోనే గుర్తించామని చైనా హెల్త్ కమిషన్ చెబుతోంది. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతోందని ఆనందించేలోపు మళ్లీ వైరస్ విజృంభిస్తోందని వస్తున్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here