15 సెకన్లలో కరోనా వైరస్ ఖతం.. ఎలా అంటే…?

0
314

ప్రపంచ దేశాల ప్రజలను గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతమైన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తే తప్ప పరిస్థితులు అదుపులోకి రావని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు వైరస్, వ్యాక్సిన్ గురించి వేర్వేరు ప్రయోగాలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా కరోనాకు కొన్ని తాత్కాలిక పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నరసింహాచారి అనే యువశాస్త్రవేత్త ఎక్కువ తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలను వెదజల్లే ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే కేవలం 15 సెకన్లలో కరోనా వైరస్ ను సులభంగా నిర్వీర్యం చేయగలదు. వస్తువులు, కూరగాయల ద్వారా కరోనా సోకకుండా ఈ యంత్రంతో నిర్వీర్యం చేయవచ్చని నరసింహాచారి చెబుతున్నారు.

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహాయసహకారాలతో నరసింహాచారి ఈ యంత్రాన్ని తయారు చేశారు. కరోనా వైరస్ తో పాటు ఇతర సూక్ష్మజీవులను సైతం ఈ యూవీ యంత్రంతో నిర్వీర్యం చేయొచ్చని నరసింహాచారి చెబుతున్నారు. కరోనా వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోయినా శాస్త్రవేత్తలు చేస్తున్న వినూత్న ప్రయోగాలు త్వరలోనే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుతుండటం గమనార్హం.

మరోవైపు కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరగుతుండగా కొన్ని వ్యాక్సిన్లు వాలంటీర్లపై దుష్ప్రభావాలను చూపుతున్నాయి. దీంతో పలువురు శాస్త్రవేత్తలు సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.