మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు, దాన్ని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ పురాణంలో భోజనానికి సంబంధించిన కొన్ని నియమాలను ప్రస్తావించినట్లు జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఇవి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నారు.

పురాణాల ప్రకారం భోజనం చేసే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యమని చెబుతారు. ఇది శరీర పరిశుభ్రతకే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని భావిస్తారు. భోజనం ముందు ఆహారానికి నమస్కరించడం కూడా భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది.
భోజనం సమయంలో చెప్పులు ధరించకూడదని, తలకు కట్టు లేదా టోపీ పెట్టుకుని తినకూడదని పౌరాణిక గ్రంథాల్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. అలాగే భోజనం ప్రారంభంలో తీపి పదార్థం తీసుకోవడం మంచిదని పెద్దలు సూచిస్తారు. అందుకే పాయసం లేదా నెయ్యితో భోజనం మొదలుపెట్టే ఆచారం ఇప్పటికీ అనేక ఇళ్లలో కనిపిస్తుంది.
ఉప్పును ముందుగానే ప్లేట్‌లో ఎక్కువగా వేసుకోవడం మంచిది కాదని కూడా కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. భోజనం మధ్యలో అవసరానికి తగ్గట్టుగా వడ్డించుకోవడం ఉత్తమమని భావిస్తారు. అదే విధంగా పాలు తీసుకున్న వెంటనే పెరుగు తినకూడదని కూడా సూచనలు ఉన్నాయి.
చీకట్లో భోజనం చేయరాదని పూర్వీకులు చెప్పిన మాటకు కూడా ప్రత్యేక కారణం ఉందని అంటారు. కరెంట్ వెళ్లిపోయినప్పుడు లేదా వెలుతురు లేని పరిస్థితిలో భోజనం ఆపి, మళ్లీ దీపం లేదా వెలుతురు వచ్చిన తర్వాత కొనసాగించడం మంచిదని విశ్వసిస్తారు.
కొన్ని తిథులలో కొన్ని ఆహారాలను నివారించాలని కూడా పురాణాల్లో ప్రస్తావించినట్లు చెబుతారు. పాడ్యమి రోజున గుమ్మడికాయ, అష్టమి రోజున కొబ్బరి, త్రయోదశి రోజున వంకాయ తినకూడదనే నమ్మకాలు ఇప్పటికీ కొందరిలో ఉన్నాయి.
భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. కనీసం కొంతదూరం నడిస్తే జీర్ణక్రియ సులభంగా జరుగుతుందని చెబుతున్నారు.
ఇలాంటి ఆహార నియమాలు పాతకాలం నుంచి భారతీయ జీవన విధానంలో భాగంగా కొనసాగుతున్నాయి. వీటిలో కొన్నింటికి ఆరోగ్య పరమైన కారణాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



























