హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భగ్గుమంటున్న వివాదం… సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత ఉద్విగ్నంగా మారింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పలువురు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు
రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి ఆ హీరోయిన్ కోసం మై హోం భూజా వెళ్లినట్లు చెబుతూ, ఆ రాత్రి ఏం జరిగిందో ఆయనే చెప్పుకోవాలంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఇది మొదట మాత్రమే. త్వరలోనే అన్ని ఆధారాలతో బయటకు వస్తాను,” అని ఆయన స్పష్టం చేశారు.
వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్, ‘కామన్’ వ్యాఖ్యలపై విమర్శలు
రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో చేరిన విధానం, దుబాయ్‌లో ఆయన చేసిన కార్యాచరణలు అన్నీ తనకు తెలుసంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ… ‘‘రేవంత్ రెడ్డి భార్యాభర్తల మధ్య సంభాషణలు కూడా వినే స్థాయికి దిగజారాడు,’’ అని మండిపడ్డారు.
ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురించి ‘‘ఇది కామన్’’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అది మామూలు విషయం కాదని, ఈడీ, సీబీఐ వలయంలోకి తీసుకుని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
118 మంది ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు, అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వంత మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన పాడి కౌశిక్ రెడ్డి… 118 మంది ఎమ్మెల్యేలు ఈ ట్యాపింగ్ బాధితులే అన్నవారు. తన ఆరోపణలపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టవచ్చని, కానీ తాను ఏమాత్రం భయపడబోనని తేల్చి చెప్పారు.
రాజకీయ ఉత్కంఠ
ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. సీఎం రేవంత్ దీనిపై ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ శిబిరం మరోసారి రేవంత్ రెడ్డిపై లైన్లో దూకడంతో, కాంగ్రెస్‌కు ఇది చిక్కుకి దారితీయబోతోందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.


































