తెలంగాణ గర్వకారణమైన రామప్ప ఆలయ రక్షణ కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ చారిత్రక కట్టడాన్ని పిడుగులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రామప్ప ఆలయం పరిసరాల్లో లైట్నింగ్ అరెస్టింగ్ టవర్ ఏర్పాటు చేయడంతో ఆలయ భద్రతపై కొత్త ఆశలు నెలకొన్నాయి.

దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయం కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శాండ్‌బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం శాస్త్రీయ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా గుర్తింపు పొందింది. ఎన్నో దాడులు, ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచిన ఈ కట్టడం ప్రస్తుతం దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఇటీవల కాలంలో పిడుగుల ప్రభావం వల్ల పురాతన ఆలయాల నిర్మాణాలకు నష్టం వాటిల్లిన ఘటనలు చోటుచేసుకోవడంతో పురావస్తు శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయాన్ని రక్షించేందుకు 21 మీటర్ల ఎత్తుతో ప్రత్యేక లైట్నింగ్ అరెస్టింగ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. టవర్‌కు కాపర్ వైర్‌తో కూడిన ప్రత్యేక పరికరాలను అమర్చారు. పిడుగు పడినప్పుడు విద్యుత్ శక్తిని భూమిలోకి మళ్లించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
ఆలయం చుట్టూ సుమారు 150 మీటర్ల పరిధిలో పిడుగుల ప్రభావం తగ్గేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే పిడుగులు ఎన్ని సార్లు పడ్డాయో గుర్తించే ప్రత్యేక పరికరాన్ని కూడా అమర్చారు. దీంతో భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది.
రామప్ప ఆలయంతో పాటు వేయి స్తంభాల గుడి, కిలా వరంగల్ వంటి చారిత్రక కట్టడాల వద్ద కూడా ఇలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు. గతంలో పిడుగుల కారణంగా కొన్ని నిర్మాణ భాగాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉప ఆలయాలకు రక్షణ కంచెలు కూడా నిర్మిస్తున్నారు.
యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప ఆలయానికి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో భద్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ఆలయ పరిరక్షణకు ఆధునిక పద్ధతులను అమలు చేస్తున్నారు. చారిత్రక సంపదను భావితరాలకు అందించాలంటే ఇలాంటి రక్షణ చర్యలు కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



























