టాలీవుడ్ సినీ నటుడు కృష్ణుడునీ సైబరాబాద్ పోలీసులు వారి కస్టడీలోకి తీసుకున్నారు. అసలు ఈ నటుడిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కృష్ణుడు కొందరు స్నేహితులతో కలిసి మియాపూర్ లోని ఒక విల్లాలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడటంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మియాపూర్ విల్లాలో అక్రమంగా పేకాట ఆడుతున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

వీరిలో టాలీవుడ్ నటుడు కృష్ణుడు ఉండడం గమనార్హం ఈ తొమ్మిది మందిలో పెద్దిరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు వీరందరినీ మియాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ విధంగా స్టేషన్ కు వెళ్ళిన నిందితులను కొద్దిసేపటి తర్వాత తమ సొంత పూచీకత్తుపై పోలీసులు పిలిచినప్పుడు స్టేషన్ కి హాజరవుతామని స్వయంగా చెప్పడంతో పోలీసులు వీరిని వదిలిపెట్టారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు పలువురు సినీ తారలను విచారిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ నటుడు కృష్ణుడు ఈ విధంగా అక్రమ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడటం ఇండస్ట్రీలో మరింత కలకలం సృష్టిస్తోంది. అయితే కృష్ణుడు గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు.
ఈ చిత్రం తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే ఈ చిత్రంలో నాగచైతన్య స్నేహితుని పాత్రలో సందడి చేశారు. అలాగే వినాయకుడు సినిమాలో కూడా కృష్ణుడు నటించినప్పటికీ ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.































