న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చాణక్యపూరి ప్రాంతంలో, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ దొంగల బారిన పడ్డారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

సోమవారం ఉదయం సుధా రామకృష్ణన్ తన సహచర ఎంపీతో కలిసి చాణక్యపూరిలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో నడుస్తున్నారు. ఈ సమయంలో హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఒక పార్లమెంట్ సభ్యురాలిపైనే ఇటువంటి దాడి జరగడంపై ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దౌత్య కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు ఉండే చాణక్యపూరి వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం ఢిల్లీ భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా సుధా రామకృష్ణన్ లేఖ రాసినట్లు తెలిసింది.



































