నటి పూనమ్ కౌర్ నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో వివాదం సృష్టిస్తుంటారు. ఈమె చేసే ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేస్తుందో కూడా అర్థం కాదు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ చేస్తూ పలు వివాదాలకు కారణం అయ్యే పూనమ్ కౌర్ తాజాగా డ్రగ్స్ కేసులో స్పందించారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్ మాఫియా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారిని విచారిస్తున్నారు.

డ్రగ్ మాఫియా మాత్రమే కాకుండా మనీలాండరింగ్ విషయంలో చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 12 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా మరి కొంతమంది పేరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ అనేది కేవలం ఒక సెలబ్రిటీ సమస్య మాత్రమే కాదని, ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య అని డ్రగ్స్ వ్యవహారం పొలిటికల్ ఎజెండాతో జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారం అనేది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య అంటూ పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే ఈ వ్యవహారం మొత్తం బయటపెడతానని, ఈ విషయం గురించి తన అనుభవాలను అందరితో పంచుకుంటా అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అసలు పూనమ్ ఏ విషయం గురించి మాట్లాడుతుంది అంటూ ఈమె చేసిన ట్వీట్ పై చర్చలు జరుగుతున్నాయి.
































