ఈ మధ్య కాలంలో ప్రజలు ఇంట్లో వండుకోవడం కంటే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. తక్కువ సమయంలో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ ఆర్డర్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రజలకు వేగంగా నచ్చిన ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాయి. అయితే ఆన్ లైన్ ద్వారా స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా కాలం నుంచి వినియోగదారులు కోరుకుంటున్నారు.

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇంటి దగ్గర నుంచే స్ట్రీట్ ఫుడ్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. చిన్న వీధి వ్యాపారాలను ఆన్ లైన్ లోకి తెచ్చే దిశగా స్విగ్గీ అడుగులు వేస్తోంది. 250 వీధి ఆహార సరఫరా వ్యాపారులతో మొదట పైలెట్ ప్రాజెక్ట్ గా స్విగ్గీ స్ట్రీట్ ఫుడ్ ను హోం డెలివరీ చేయనుంది. ప్రధాన నగరాలైన ఇండోర్, వారణాసి, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ డెలివరీ ప్రారంభించనుంది.

‘ప్రైమ్‌ మినిస్టర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌నిధి’ లో భాగంగా స్విగ్గీ దేశవ్యాప్తంగా వీధి ఆహార సరఫరా దారులతో ఒప్పందాలు చేసుకుని ఫుడ్ డెలివరీ చేయనున్నట్టు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటన చేసింది. ప్రైమ్‌ మినిస్టర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌నిధి వీధి వర్తకులకు పాన్ కార్డ్ అందేలా, యాప్ ల వినియోగం గురించి అవగాహన ఏర్పడేలా, ఆహారభద్రతా ప్రమాణాల అథారిటీతో రిజిస్ట్రేషన్ జరిగేలా కేంద్రం చేసింది.

వీధి వ్యాపారులతో స్విగ్గీ ఒప్పందాలు చేసుకోవడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకు ఫుడ్ లభ్యమయ్యే అవకాశం ఉంది. ప్రజలకు గతంతో పోలిస్తే ఖర్చు తగ్గడంతో పాటు నచ్చిన స్ట్రీట్ ఫుడ్ ను రుచి చూసే అవకాశం కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు స్ట్రీట్ ఫుడ్ రుచిని ఇష్టపడే వారికి స్విగ్గ్రీ డెలివరీ చేసే స్ట్రీట్ ఫుడ్ వల్ల ప్రయోజనం కలగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here