కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి విదితమే. కేంద్రం కొన్ని నెలల క్రితం జన్ ధన్ ఖాతా ఉన్న మహిళల ఖాతాలలో నగదు జమ చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చును మహిళల ఖాతాలో జమ చేసింది. మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది.
అయితే గత కొన్ని రోజుల నుంచి కేంద్రం దేశంలోని ప్రతి మహిళకు 2,20,000 రూపాయలకు జమ చేస్తోందని సోషల్, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి దొరకకపోవడం, ఆదాయం తగ్గడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రధానమంత్రి నారీశక్తి యోజన స్కీం కింద 2,20,000 రూపాయలు జమ చేస్తున్నట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి కేంద్రం నిజంగానే మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తోందా..? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కేంద్రం నుంచి అధికారికంగా ఈ స్కీమ్ ద్వారా 2,20,000 రూపాయలు నగదు జమ చేస్తున్నట్టు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని తెలిపింది.
కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాల్లో అసలు ఇలాంటి పథకమే లేకపోవడం గమనార్హం. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ పెంచుకోవాలనే దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. విశ్లేషకులు ఇలాంటి వార్తలను ఇతరులకు షేర్ చేసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.