వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, దుర్వాసన రావడం వంటి లక్షణాలు చాలామందిని ఆందోళనకు గురిచేస్తాయి. వైద్య నిపుణుల ప్రకారం ఎక్కువసార్లు ఇది డీహైడ్రేషన్‌కు సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఎండల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు, ఖనిజాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ సమయంలో తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి రంగు కూడా గాఢంగా కనిపిస్తుంది.

మూత్రానికి సహజంగా రంగు ఇవ్వడంలో ‘యూరోక్రోమ్’ అనే పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో నీరు సరిపడా ఉంటే మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ నీటి కొరత ఏర్పడితే అదే పదార్థం గాఢంగా మారి మూత్రం ముదురు రంగులో కనిపిస్తుంది. కొన్నిసార్లు విటమిన్ బి టాబ్లెట్లు, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడినప్పటికీ ఇలాంటి మార్పులు కనిపించవచ్చు.
అయితే ఎక్కువ రోజులు మూత్రంలో మంట, తీవ్రమైన దుర్వాసన, కడుపు నొప్పి వంటి లక్షణాలు కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ లేదా లివర్ సమస్యలకు సంకేతం కావచ్చని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
వేసవిలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ వంటి సహజ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు అందుతాయి. చిన్న లక్షణాలనైనా నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.





























