వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పాటు తన కూతురును కాపాడండి అంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. కృష్ణాజిల్లా విజయవాడలోని న్యూరాజరాజేశ్వరి పేటకు చెందిన మహిళ ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది.

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్లకు ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆమె తన భర్తను వదిలేసి పాపతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే తను ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు అఖిల్ తో పరిచయం ఏర్పడింది. అతడు ఆమె కంటే చాలా చిన్న వాడు.
ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాట మార్చాడు. తీరా ఆమె మోసపోయినట్లు గ్రహించి ఆత్మహత్య చేసుకోవాని నిర్ణయం తీసుకుంది. దీని కంటే ముందు తన 13 నెలల కుమార్తెను కాపాడాలంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. తర్వాత ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే భావించి ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.
ఆ మెసేజ్ కు స్పందించిన పోలీసులు 10 నిమిషాల్లోనే బాధిత మహిళ ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెను రక్షించి.. చిన్నారిని వారి బంధువులకు అప్పగించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





























