Adavi Simhalu : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1977లో ఆయన దశ దిశ మారిందనే చెప్పాలి. తృటిలో తప్పి పోయే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తనకిచ్చిన అవకాశంతో సత్యచిత్ర బ్యానర్ లో “అడవిరాముడు” చిత్రాన్ని ఎన్టీరామారావుతో తీసి విజయ దుందుభి మోగించారు. ఆ తరువాత రాఘవేంద్ర రావు, సూపర్ స్టార్ కృష్ణ తో అనేక చిత్రాలు రూపొందించారు. అదేవిధంగా రెబల్ స్టార్ తో కూడా అద్భుత విజయాలను దర్శకేంద్రుడు సొంతం చేసుకున్నారు.

ఇకపోతే 1974లో స్థాపించిన వైజయంతి మూవీస్.. “ఎదురులేనిమనిషి” చిత్రంతో సినీ గమనాన్ని ప్రారంభించింది. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ అనతికాలంలోనే ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణంరాజు కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో అనేక చిత్రాలను రూపొందించారు. అలా దర్శకుడు రాఘవేంద్రరావు మొదటిసారిగా ఈ సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో పనిచేయడం జరిగింది. అదే సంవత్సరంలో కృష్ణ దాదాపు నాలుగు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అలా రాఘవేంద్ర రావు సూపర్ స్టార్ రెబల్ స్టార్ లతో ఒక చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికంటే ముందే 1978 మల్లికార్జునరావు దర్శకత్వంలో “మనుషులు చేసిన దొంగలు” అనే చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. ఆ తర్వాత తిరిగి అడవి సింహాలు చిత్రంలో నటించారు.

“అడవి సింహాలు” 1983 తెలుగు యాక్షన్ చిత్రం, దీనిని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థపై సి.అశ్వినిదత్ నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. సినీ తారలు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం ఏకకాలంలో హిందీలో “జానీ దోస్త్ “గా విడుదలైంది. ఈ హిందీ చిత్రంలో ధర్మేంద్ర, జీతేంద్ర, శ్రీదేవి, పర్వీన్ బాబీలు కీలక పాత్రల్లో నటించారు. రెండు సినిమాలు ఒకే బ్యానర్, ఒకే దర్శకుడిచే ఒకేసారి నిర్మించబడ్డాయి, కొన్ని సన్నివేశాలు, కళాకారులు రెండు వెర్షన్లలో ప్రతిరూపంగా నిలిచారు… అయితే ఈ సినిమాలో కృష్ణ కృష్ణంరాజు స్నేహితులుగా కొనసాగుతారు. గిరిజనుల అటవీ సంపదను దోచుకునే ముఠాను అడ్డుకునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

కృష్ణ సరసన శ్రీదేవి నటించగా కృష్ణంరాజు సరసన జయప్రద నటించారు. ఈ సినిమా షూటింగ్ మద్రాస్, మధుమలై, విశాఖపట్నంలో కొనసాగింది. వైజాగ్ సమీపంలో గల భీమిలి ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు వెచ్చించి కోయగూడెం సెట్ వేయించారు. దాదాపు 30 అడుగుల ఎత్తుతో అడవితల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందులో “అడవిసింహాలు” చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారీ సినిమాలు నిర్మించే వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. సినిమా షూటింగ్ లో లారీ వాహన ఉపయోగం ఎక్కువగా ఉండడంతో అద్దెకు తీసుకోకుండా అశ్వినిదత్ ఒక కొత్త లారీని కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత “నూల్” అనే మరో తార ఇందులో నటించారు. నూలు అంటే మరో హాలీవుడ్ హీరోయిన్ కాదు. అచ్చంగా తొమ్మిదేళ్ళ “చింపాంజీ”. దీనిని అమెరికా నుంచి అద్దెకు తెప్పించారు. ఈ చిత్రంలో “నూల్” ద్విపాత్రాభినయం పోషించడం గమనార్హం.

ఒకటి హీరోల దగ్గర ఉండగా మరొకటి విలన్ గ్రూపులో ఉంటుంది. అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో “నూల్” తప్పిపోయింది. షూటింగ్ రద్దు చేసుకొని దాదాపు ఒకరోజంతా వెతికితే “నూలు” దొరకింది. నూల్ కోసం నిర్మాత అశ్వినీదత్ దాదాపు ఆరు లక్షల రూపాయల వెచ్చించారు.

ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినిదత్ దాదాపు 75 లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఈ సినిమా 1983 ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. విడుదలైన మొదటి వారంలోనే 64 లక్షల రూ.ల వసూళ్లను రాబట్టింది. సూపర్ స్టార్, రెబల్ స్టార్ అభిమానులకు అనుగుణంగా దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను రూపొందించడంతో బాక్సాఫీస్ వద్ద “అడవి సింహాలు” చిత్రం విజయవంతంగా నిలిచింది.

































