ప్రస్తుతం చాలామంది జీవితం కంప్యూటర్ స్క్రీన్‌ల చుట్టూనే తిరుగుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లి డెస్క్ ముందు కూర్చోవడం, మధ్యలో ఫోన్, ల్యాప్‌టాప్‌లతో పని కొనసాగించడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొబైల్‌తో సమయం గడపడం సాధారణమైపోయింది. అయితే ఈ నిశ్చల జీవనశైలి ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చునే అలవాటును ఇప్పుడు “సిట్టింగ్ డిసీజ్”గా పరిగణిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, మన శరీరం ఎప్పుడూ కదలికలో ఉండేలా రూపొందింది. కానీ గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల శరీరంలోని జీవక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా కండరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో కొవ్వు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతోంది.
రోజూ జిమ్‌కి వెళ్లి గంటసేపు వ్యాయామం చేసినా, మిగతా సమయం మొత్తం కుర్చీలోనే గడిపితే ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇవే హైబీపీ, హార్ట్ డిసీజ్‌లకు కారణమవుతాయి.
డెస్క్ జాబ్స్ చేసే వారిలో వెన్నునొప్పి, మెడ బిగుసుకుపోవడం వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంప్యూటర్ ముందు తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా ఇది క్రానిక్ బ్యాక్ పెయిన్‌గా మారే ప్రమాదం ఉంది. అలాగే మెడ, భుజాల కండరాలు గట్టిపడి శరీర భంగిమ కూడా దెబ్బతింటుంది.
అంతేకాదు, గంటల తరబడి కూర్చోవడం వల్ల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. అలసట, ఏకాగ్రత లోపించడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం, కదలిక తక్కువగా ఉండే జీవనశైలి డిప్రెషన్, ఆందోళన లక్షణాలను కూడా పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ సమస్యల నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని సులభమైన అలవాట్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా “20-8-2” రూల్‌ను పాటించడం మంచిదని చెబుతున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలు కూర్చున్న తర్వాత 8 నిమిషాలు నిలబడటం, 2 నిమిషాలు నడవడం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కదలిక లభించి రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఆఫీస్‌లో పనిచేసే సమయంలో మధ్య మధ్యలో చిన్నపాటి స్ట్రెచింగ్ చేయడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం వంటి అలవాట్లు కూడా ఉపయోగపడతాయి. వీలైతే స్టాండింగ్ డెస్క్‌లను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకు ఒక్క గంట వ్యాయామం చేయడం మాత్రమే సరిపోదు. మిగతా సమయం కూడా శరీరం యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా కదలిక ఉండే జీవనశైలి అలవాటు చేసుకుంటేనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.































