తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన నటుడు సుమన్ శెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘జయం’ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే తాజాగా ఆయన గతంలో చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమన్ శెట్టి కెరీర్‌లో దర్శకుడు తేజ పాత్ర ఎంతో కీలకమని తెలిసిందే. ‘జయం’ సినిమాలో ఇచ్చిన పాత్రతోనే ఆయనకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత సుమన్ శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఆదాయంతో ఎలా భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలో దర్శకుడు తేజ ఇచ్చిన సలహానే తన జీవితాన్ని మార్చేసిందని సుమన్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో ఒకసారి తేజను కలిసి కృతజ్ఞతలు తెలిపానని సుమన్ శెట్టి గుర్తుచేసుకున్నారు. “మీ వల్లే నాకు ఈ స్థాయి వచ్చింది.. మీ కోసం నేను ఏం చేయాలి?” అని అడిగితే, తేజ చాలా సింపుల్‌గా కానీ జీవితానికి ఉపయోగపడే సలహా ఇచ్చారని చెప్పారు. “డబ్బు చేతిలో ఉన్నప్పుడే హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయి.. భవిష్యత్తులో అది నీకు అండగా నిలుస్తుంది” అని తేజ చెప్పారట.
ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్న సుమన్ శెట్టి, వెంటనే హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. అప్పట్లో సాధారణ ధరలకు కొనుగోలు చేసిన ఆ ప్రాపర్టీ విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని ఆయన అన్నారు. తేజ ఇచ్చిన ఆ సలహా వల్లే జీవితంలో ఆర్థికంగా స్థిరపడగలిగానని కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు.
గురువుపై తనకు ఉన్న గౌరవాన్ని కూడా సుమన్ శెట్టి పంచుకున్నారు. తన ఇంట్లో ఇప్పటికీ దర్శకుడు తేజ కోసం ప్రత్యేక గది ఉంచానని, ఆ గదిలో ఆయన ఫొటో కూడా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమలో అవకాశాలు మాత్రమే కాదు, జీవితానికి ఉపయోగపడే దారి కూడా చూపించిన వ్యక్తిగా తేజను భావిస్తానని తెలిపారు.
కొంతకాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సుమన్ శెట్టి, ఇటీవల రియాలిటీ షోలతో పాటు కొత్త సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన ఈ రియల్ ఎస్టేట్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో సంపాదనను సరైన దారిలో పెట్టుబడి పెట్టాలనే సందేశం యువతను ఆకట్టుకుంటోంది.































