నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఫలాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎంత ఆరోగ్యకరమైనవైనా సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో నేరేడు పండ్లు సహాయపడతాయని చెబుతున్నారు. వీటిలో ఉండే జంబోలిన్ అనే సహజ గుణం కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియను మందగింపజేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా నేరేడు గింజల పొడి కూడా మధుమేహ నియంత్రణలో ఉపయోగకరంగా భావిస్తారు.
గుండె ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొన్ని పరిస్థితుల్లో నేరేడు పండ్లు తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. అలాగే కిడ్నీ సమస్యలున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో పొటాషియం, ఆక్సలేట్ల స్థాయిలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
సర్జరీకి ముందు లేదా తర్వాత ఈ పండ్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉండటంతో శస్త్రచికిత్స సమయంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండవచ్చు. అందుకే కనీసం రెండు వారాల ముందే వీటిని ఆపేయాలని సూచిస్తున్నారు.
నేరేడు పండ్లను కూడా పరిమితిలోనే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోజుకు సుమారు 100 నుండి 150 గ్రాముల వరకు తీసుకోవడం సరైన మోతాదుగా భావిస్తారు. అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపులో మంట, గ్యాస్ వంటి ఇబ్బందులు రావచ్చు. ఖాళీ కడుపుతో తినడం కూడా మంచిది కాదని, అలాగే పాలు లేదా పాల ఉత్పత్తులతో వెంటనే కలిపి తీసుకోవడం కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు.
మొత్తం మీద నేరేడు పండ్లు ఆరోగ్యానికి మేలు చేసే ఫలాలే అయినా, అవగాహనతో మరియు మితంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.




























