వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇటీవల వెలువడుతున్న పరిశోధనలు మాత్రం మతిమరుపును అంత తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. తరచూ విషయాలు మర్చిపోవడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకురాకపోవడం వంటి సమస్యలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం, గుండెపోటు లేదా గుండె వైఫల్యం సంభవించే కొన్ని సంవత్సరాల ముందే మెదడు పనితీరులో మార్పులు కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా గుర్తుండే విషయాలు మర్చిపోవడం, దారులు గుర్తుపట్టడంలో ఇబ్బంది పడటం, ఒక పని మీద దృష్టి నిలుపుకోలేకపోవడం వంటి సమస్యలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండె సరిగా పనిచేయకపోతే మెదడుకు అవసరమైన రక్తప్రసరణ ప్రభావితమవుతుంది. దీని వల్ల ఆలోచనా శక్తి, విషయగ్రహణ సామర్థ్యం తగ్గే అవకాశముంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది పక్షవాతం లేదా ఇతర గుండె సమస్యలకు ముందస్తు హెచ్చరికగా ఉండవచ్చని చెబుతున్నారు.
రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా మరిచిపోవడం, మాట్లాడేటప్పుడు తికమకపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ మార్పులు వేగంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, రక్తపోటు మరియు షుగర్ నియంత్రణ ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు సాధారణ వయసు ప్రభావంగా తీసుకోకుండా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.



























