భోజనం ముగిసిన తర్వాత తాంబూలం వేసుకోవడం భారతీయ సంస్కృతిలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో పాన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. తమలపాకులో వక్క, సున్నం, గుల్కండ్, యాలకులు వంటి పదార్థాలు కలిపి తయారు చేసే పాన్ నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ పాన్ మంచిదే అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పాన్ తినేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో దొరికే పాన్‌లలో తీపి పదార్థాలు, సువాసన దినుసులు, కృత్రిమ ఫ్లేవర్లు అధికంగా వాడుతున్నారు. ఇవి తాత్కాలికంగా రుచిని పెంచినా, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా తరచుగా పాన్ తినే అలవాటు ఉన్నవారిలో నోటి ఆరో్యం, జీర్ణవ్యవస్థపై ప్రభావం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పాన్‌కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాన్‌లో ఉపయోగించే వక్క, కొన్ని రకాల మసాలాలు శరీరంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇవి గర్భంలోని శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాలిచ్చే తల్లుల ద్వారా ఆ ప్రభావం చిన్నారులపై కూడా పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
కడుపులో అల్సర్లు, తీవ్రమైన గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలతో బాధపడేవారు కూడా పాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాన్‌లో ఉండే సున్నం, కాచు వంటి పదార్థాలు కడుపులో మంటను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఇది మరింత అసౌకర్యానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి మీఠా పాన్ పెద్ద ప్రమాదంగా మారొచ్చు. గుల్కండ్, చెర్రీలు, తీపి సిరప్‌లు, చక్కెర పదార్థాలు అధికంగా ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే మధుమేహ రోగులు తీపి పాన్‌లను పూర్తిగా నివారించడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పాన్‌ను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పాన్‌లోని కొన్ని పదార్థాలు శరీరంలో ఉత్తేజాన్ని పెంచి గుండె వేగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజుకు పలుమార్లు పాన్ తినే అలవాటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు లేదా రక్తస్రావం సమస్యలు ఉన్నవారికి పాన్ మరింత ఇబ్బందులు కలిగించవచ్చు. అందులోని సున్నం కారణంగా నోటి గాయాలు ముదిరే ప్రమాదం ఉంది. దీని వల్ల నొప్పి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సహజమైన తమలపాకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినా, మార్కెట్లో లభించే అన్ని రకాల పాన్‌లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.




























