న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని, బీజేపీ కోసం ఈసీ నేరాలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తాము సేకరించిన ఆధారాలు ఓట్ల దోపిడీపై స్పష్టంగా వెలుగులు నింపుతున్నాయని తెలిపారు.

రాహుల్ గాంధీ ఆరోపణలు
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఓట్ల చోరీ, అక్రమాలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం భారీ అక్రమాలు చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటి ఓట్లు చేర్చారని మేము గుర్తించాం. గత ఆరు నెలలుగా ఈసీ అక్రమాలపై దర్యాప్తు జరిపాం. మా వద్ద ఉన్న ఆధారాలు అణుబాంబుల్లాంటివి. అవి బయటకు వస్తే అసలు ఎన్నికల సంఘమే ఉండదు,” అని వ్యాఖ్యానించారు.
అక్రమాలకు పాల్పడిన ఎన్నికల సంఘం అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాహుల్ గాంధీ హెచ్చరించారు. “ఎవరి స్థాయి అయినా వదిలిపెట్టం. రిటైర్ అయిన అధికారులు ఉన్నా వారిని కూడా చట్టం ముందు నిలబెడతాం,” అని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం ప్రతిస్పందన
రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఈసీ అధికారులు మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ప్రతిరోజూ మాపై ఇలాంటి ఆరోపణలు చేయడం వారి అలవాటే అయిపోయింది. మేము మా విధుల్లో పారదర్శకత పాటిస్తున్నాం. కావాలని చేసే విమర్శలను పట్టించుకోము,” అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, ఎన్నికల సంఘం స్పందనతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వద్ద ఉన్నట్లు చెప్పిన ‘అణుబాంబు ఆధారాలు’ బయటకు వస్తాయా? అన్న ఆసక్తి నెలకొంది.



































