Night Curfew: ఓమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వేరియంట్ అత్యంత వేగంగా ప్రపంచంలోని వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోలం కలిగిస్తోంది. యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇప్పటికే యూకేలో ఓమిక్రాన్ తో 29 మరణాలు కూడా సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు 31 మంది మరణించారు. మరోవైపు ఇండియాలో కూడా ఓమిక్రాన్ కేసులు విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటి వరకు 422 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ప్రజల్ని కలవరపెడుతోంది.

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య సెంచరీని ధాటింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఓమిక్రాన్ భయాలతో పలు రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఓడిశా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.
కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ…
తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటకలో 38 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు పబ్బుల్లో, రెస్టారెంట్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చాయి. మాస్కును తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది కర్ణాటక ప్రభుత్వం. మాస్కు లేకుండా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.