వడాపావ్‌ అమ్మి నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలా అంటే..?

0
254

చాలా సందర్భాల్లో ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని మనం వింటూ ఉంటాం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్నిసార్లు ఒక ఐడియా నిజంగానే జీవితాన్ని మార్చేస్తుంది. థానేకు చెందిన ఒక వ్యక్తికి ఒకరోజు వచ్చిన ఆలోచన వల్ల అతను ప్రస్తుతం నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కేవలం వడాపావ్ అమ్మి ఆ వ్యక్తి ఈ మొత్తం సంపాదిస్తూ ఉండటం గమనార్హం. నెలకు 35 వేల రూపాయల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలి ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల అతని జీవితమే పూర్తిగా మారిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే థానేకు చెందిన గౌరవ్ లాండే అనే వ్యక్తి ఒకసారి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాడు. సాధారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎవరైనా ఆలస్యం అవుతుందని చిరాకు పడుతూ అసహనంతో ఉంటారు. గౌరవ్ కూడా అదే విధంగా ట్రాఫిక్ జామ్ వల్ల 4 గంటల పాటు ట్రాఫిక్ లోనే ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి బఠానీలు అమ్మడం గౌరవ్ గమనించాడు. ఆ వ్యక్తి బఠానీలు అమ్మినట్టే తను కూడా వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించాడు.

ఆ తరువాత 35వేల రూపాయల వేతనం వస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రాఫిక్‌ వడా పావ్ పేరుతో తాజా వడాపావ్ లను బాటర్ బాటిల్ తో పాటు అమ్మడం ప్రారంభించాడు. కేవలం 20 రూపాయలకే సాయంత్రం 5 గంటల నుంచ్ 10 గంటల మధ్య ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వడాపావ్ ను అమ్మడం ద్వారా 2 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తూ ఉండటం గమనార్హం.

గౌరవ్ వడాపావ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ తాను పదేళ్ల క్రితం పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేసేవాడినని.. ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయంలో విపరీతమైన ఆకలి వేసేదని.. ఆ అనుభవం వల్లే ట్రాఫిక్‌ వడా పావ్ బిజినెస్ ను ప్రారంభించానని చెప్పుకొచ్చారు. 8 మంది డెలివరీ బాయ్స్ తో గౌరవ్ ఈ బిజినెస్ ను చేస్తున్నారు.