పెళ్లి అనగానే ఇళ్లంతా సందడి సందడిగా కనపడుతుంది. బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. ఓ ప్రదేశంలో మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే.. వివాహం జరిగే వేడుక వద్ద వరుడి తరఫు బంధువులు విపరీతంగా కాల్పులు జరిపారు. దీనిలో వధువు మామకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. వివాహ వేడుక వద్దనే ఇలా ఉన్నారంటే.. రేపు పెళ్లి అయిన తర్వాత తాను లేని సమయంలో ఎలా ఉంటుందో అనే భయం వేస్తుందని.. వధువు వాపోయింది. దీంతో ఆమె వాళ్లతో పెళ్లి సంబంధాన్ని తెంచేసుకుంది. దీంతో పెళ్లి అక్కడిక్కడే ఆగిపోయింది. ఇలా ప్రకటించిన వెంటనే వధువు తరఫు బంధువులు వరుడి కుటుంబం పై దాడి చేసి.. కారును పగలగొట్టి అతని బంధువులను బంధించారు.
దీంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాల్పులు ఎవరు జరిపారనే వివరాలను పోలీపులు ఆరా తీశారు. పెళ్లిలో తీసిన వీడియోల ఆధారంగా ఎవరు కాల్పులు జరిపారో తెలుసుకున్నారు.
వరుడు షాజాద్ అతని సోదరుడు పప్పు, సానుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పలావత్ తెలిపారు. లెసెన్స్ కలిగిన ఆయుధం నుంచి బెల్లెట్ పేలితే.. ఆ ఆయుధ లైసెన్స్ రద్దుకు నివేదిక పంపిస్తారని రవీంద్ర పలావత్ అన్నారు. ఇక గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.




























