పోస్టాఫీసులో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. అయితే ఈ రెండూ తప్పనిసరి?

0
99

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే ప్రకటించింది. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు స్మార్ట్ఫోన్లు లేక ఇబ్బందులు పడుతూ ఉండగా.. మరి కొందరు చదువుకోని నేపథ్యంలో వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై ఏమాత్రం అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బంది పడేవారికి పోస్టల్ శాఖ శుభవార్తను తెలిపింది.

కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారు పోస్టాఫీస్‌కు వెళ్తే చాలు కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియను ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా అందజేయాలని తెలంగాణ పోస్టల్ శాఖ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగాఎన్నో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో పోస్టల్ శాఖ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 36 హెడ్‌, 643 సబ్‌, 10 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఇప్పటికే టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. త్వరలోనే మరో 800 పోస్టాఫీసులలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునేవారు తప్పకుండా వారి వెంట వారు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు తీసుకువెళ్లాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో ఫోను కు వచ్చే వన్ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) నమోదు చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత మీకు టీకా ఏ రోజున, ఏ వ్యాక్సినేషన్ కేంద్రంలో వేస్తారు మెసేజ్ రూపంలో మీ సెల్ ఫోన్ కి వస్తుంది. ఆరోజు వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా చేయించుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పోస్టాఫీసుల్లో ఎటువంటి రుసుము చెల్లించకుండా పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చని పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె వెంకటరామిరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here