హైదరాబాద్: టాలీవుడ్ సినీ కార్మికులు తమ వేతనాల పెంపు డిమాండ్లతో కొనసాగిస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 30 శాతం వేతనాల పెంపుపై నిర్మాతలకు, కార్మికుల ఫెడరేషన్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గత వారం రోజులుగా షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమ్మె కారణంగా చిత్రపరిశ్రమకు రోజుకు సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పేర్కొంది.

ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ వివాదంపై కీలక చర్యలు తీసుకుంది. సంస్థ సివిల్ కోర్టులో కేసు నమోదు చేయడంతో పాటు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు చెందిన కీలక నేతలు వల్లభనేని అనిల్, అమ్మిరాజు, అలెక్స్‌లకు వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు పంపింది. ఈ చర్య సినీ కార్మికులలో, ఫెడరేషన్ నేతలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి లీగల్ నోటీసులు అందుకోవడంపై తీవ్రంగా స్పందించిన ఫెడరేషన్ నేతలు, త్వరలో కార్మిక నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. రానున్న ఆదివారం తమ తదుపరి కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని మొత్తం టాలీవుడ్ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

































