అలర్జీ ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా..?

0
294

కొన్ని రోజుల క్రితం వరకు కరోనా వైరస్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బ్రిటన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ అలర్జీతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవద్దని సూచనలు చేశారు. బ్రిటన్ ప్రభుత్వం నిన్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్ కు చెందిన ఇద్దరు హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ ను తీసుకోగా వాళ్లు అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో బ్రిటన్ కు చెందిన అధికారులు మందులు, ఆహార పదార్థాలకు అలర్జీ వచ్చే వాళ్లు ఫైజర్‌– బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్ ను తీసుకోకూడదని సూచనలు చేసింది. యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరికి ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటు రక్తప్రసరణలో మార్పులు వచ్చినట్టు గుర్తించామని తెలిపింది. వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చేముందు రోగుల మెడికల్ హిస్టరీని పరిశీలించాలని సూచనలు చేసింది.

మెడికల్ హిస్టరీలో ఎవరైనా అలర్జీతో బాధ పడుతున్నట్టు తేలితే వ్యాక్సిన్ ఇవ్వవద్దని సూచనలు చేసింది. సాధారణంగా కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. మెడికల్ హిస్టరీని పరిశీలించి వ్యాక్సిన్ ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకోవాలని అధికారులు వైద్యులకు సూచించారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డ వాళ్లు కోలుకుంటున్నారని.. వారికి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం బ్రిటన్ దేశంలో వయస్సు పై బడిన వారికి మొదట కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. బ్రిటన్ ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొద్దిమందిలో మాత్రం బెలీ పాల్స్ సమస్యను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.