ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిని జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. ‘‘బెట్టింగ్ యాప్‌లకు బానిసలైన వారికి విగ్రహాలు కడతారా? ఇది ఏ రకమైన ఉదాహరణ? సమాజం ఎటు పోతుంది’’ అంటూ వైయస్ జగన్ ను ఆమె నిలదీశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిందిగా సూచించిన షర్మిల, జగన్‌కి ప్రజల కష్టాలు పట్టవని, బల ప్రదర్శనలు చేయడమే ముఖ్యమని విమర్శించారు. ‘‘జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కావడంతో కేంద్రం నుంచి అనుమతులన్నీ సంపూర్ణంగా వస్తున్నాయి’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు మాత్రం అనవసర ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం పోరాడితే హౌస్ అరెస్టు చేస్తారు, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు చేస్తే అడ్డుకుంటారు. ఇదెక్కడి న్యాయం?’’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ యాత్రలకు మాత్రం ఏ ఆంక్షలు లేకుండా జరుగుతుండడాన్ని ఆమె సమానత్వానికి విరుద్ధంగా అభివర్ణించారు.
‘‘జగన్ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి పోలీసులను కూడా కొనగలడు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పరామర్శ కార్యక్రమంలో ఇద్దరి మృతి చెందినదాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?’’ అని ప్రశ్నించారు. కార్యక్రమానికి 100 మందికి అనుమతి ఇస్తే వేల మంది ఎలా చేరారని, పోలీసుల తీరుపై కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘పోలీసు శాఖ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని’’ పేర్కొన్నారు.






























