బీజేపీలో రాజా సింగ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కుల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రెడ్డి సామాజికవర్గానికే ఇస్తారా అనే చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లకు అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలన్నారు.
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్‌కు అమ్మేశారని ఆరోపించారు. ఈసారి ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను ఎవరికి అమ్ముతారో చూడాలన్నారు. బీఆర్ఎస్‌కా? లేక కాంగ్రెస్‌కా? అని ప్రశ్నించారు.
అంతేకాదు, గతంలో బీజేపీలో కుల రాజకీయం జరిగిందని, ఈసారి కూడా అదే జరుగుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరి పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరగనుంది.
ఇదిలా ఉంటే, రాజా సింగ్ గతంలో కూడా కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కిషన్ రెడ్డికి కళ్లున్నా చూడలేరు, నోరున్నా మాట్లాడలేరు అంటూ ఎద్దేవా చేశారు. దీంతో కిషన్ రెడ్డి, రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది.































