ఇప్పటి జీవనశైలిలో గుండె జబ్బులు, షుగర్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోజూ వాడే వంట నూనెపై సరైన అవగాహన అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది బ్రాండ్ పేరు చూసి నూనె కొనుగోలు చేస్తారు కానీ అది ఎలా తయారైంది, ఎన్ని సార్లు వేడి చేస్తున్నాం, ఏ వంటకు ఏ నూనె వాడుతున్నామనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఇవే ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి వంటకు ఒకే రకమైన నూనె వాడటం మంచిది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. డీప్ ఫ్రై, తాలింపు, తక్కువ మంటపై వంటలు వంటి పద్ధతులకు వేర్వేరు నూనెలు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఒకసారి వేయించిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల హానికర రసాయనాలు ఏర్పడి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పాతకాలంలో ప్రాంతాల వారీగా వేర్వేరు నూనెలను వాడేవారు. దక్షిణ భారతదేశంలో కొబ్బరినూనె, ఉత్తర ప్రాంతాల్లో ఆవనూనె, పశ్చిమ ప్రాంతాల్లో వేరుశెనగ నూనె ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం మళ్లీ ఆ పద్ధతుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అలాగే బ్లెండెడ్ ఆయిల్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్యంగా అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలికి కేవలం వ్యాయామం సరిపోదు. వంటింట్లో ఉపయోగించే నూనె ఎంపిక కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి అలవాటుగా కాకుండా అవగాహనతో నూనెను ఎంపిక చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.































