‘సూర్యకాంతం’ ఇలాంటి గయ్యాళి అత్త.. అద్భుతమైన నటి మళ్ళీ పుడతారా..?

‘సూర్యకాంతం’.. సినిమా ఇండస్ట్రీలో నేటి తరం వారికి వృత్తి పరంగా, వ్యక్తిగత విషయాలలోనూ ప్రతీ ఒక్కరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అయిన గొప్ప నటీమణి. ఆమె తర్వాత మళ్ళీ అటువంటి నటీ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో తారసపడలేదు అంటే నమ్మి తీరాల్సిందే. ఎంతోమంది బయోపిక్స్ తీస్తున్న దర్శక, నిర్మాతలు ‘సూర్యకాంతం’ లాంటి అద్భుతమైన నటి బయోపిక్ ఎందుకు తీయడం లేదో అర్థం కావడం లేదని ఆ జనరేషన్ వారు మాత్రమే కాదు ఇప్పటి జనరేషన్ వారు కూడా మాట్లాడుకుంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా సూర్యకాంతం పుట్టారు. 14వ సంతానం అంటే ఆ రోజుల్లోనే అవాక్కయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. సూర్యకాంతంకి ఆరేళ్ళ వయసు నుంచే పాడటం, డాన్స్ చేయడం నేర్చుకున్నారు. యుక్త వయసు వచ్చేసరికి సూర్యకాంతాన్ని ఎక్కువగా హిందీ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఆ ఆకర్షణ వల్లే సినిమాల్లో నటించాలనే కోరిక కలిగి చెన్నై చేరుకున్నారు.

అలా జెమిని స్టూడియో వారు నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోయిన నిర్మాతకి తనకున్న
ఆర్ధిక ఇబ్బందులను వివరించి 75 రూపాయలు ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఆ మొత్తాన్ని అందుకున్నారు. ఇక 1949 లో ధర్మాంగద సినిమా చేసే అవకాశం అందుకున్నారు. ఈ సినిమాలో సూర్యకాంతానిది మూగవేషం. బాగా చేసినప్పటికి ఆమెకి చిన్న చిన్న వేశాలే వచ్చాయి. దాంతో లీలా కుమారి సాయం తీసుకొని నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం అందుకున్నారు. అప్పట్లో నటీ నటులెవరైనా అగ్రిమెంట్ ప్రకారం జెమినీ స్టూడియో వారు నిర్మించే సినిమాలలో మాత్రమే నటించాలనే రూలు ఉండేది.  

దానీ ప్రకారమే సూర్యకాంతం వారి బ్యానర్ లో సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఆమెకి చిన్న చిన్న పాత్రలే ఇస్తుండటంతో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. సూర్యకాంతంకి ముందు నుంచి బొంబాయికి వెళ్ళి హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. కానీ అందుకు తన ఆర్థిక స్తోమత సరిపోక ఆ కోరికను చంపుకున్నారు. సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం అందుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా సౌదామిని సినిమాలో  వచ్చింది. హీరోయిన్ గా నటించాలనేది సూర్యకాంతం కల.

కానీ హీరోయిన్ అవకాశం వచ్చిన సమయంలోనే కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం కోల్పోయారు. మళ్ళీ సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. ఈ పాత్రకి విపరీతమైన పేరు రావడంతో హీరోయిన్ అవ్వాలనుకున్న సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్రలకే పరిమితం అయ్యారు. ఈ వేశాలతో బాగా పాపులారిటీ రావడంతో ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆవిడ నటించినన్ని రోజులు గయ్యాళ్లి అత్త పాత్రలోనే నటించి స్టార్ డం సంపాదించుకున్నారు.