ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.

ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం వరకూ ప్రయాణమై వచ్చాడు. తపోవనమంతా వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునుడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అంత్యక్రియలు పూర్తిచేసేసాడు.

అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మనమంతా కూడా కాల గమనంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా ఏ శిక్ష నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సర్వే జనా సుఖినోభవంతు