అత్తా, కోడలి మధ్య మొబైల్ విషయంలో గొడవ.. మనస్థాపంతో కోడలు ఏం చేసిందంటే..!

కొన్ని ఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతాయి. మనం అలర్ట్ అయిపోయేసరికి జరిగే నష్టం కాస్త జరిగిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌ లోని సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన మహిళకు తన అత్తకు మొబైల్ విషయంలో గొడవ జరిగింది.

దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో పని లేని సమయంలో మొబైల్ చూడటం కూడా తప్పా.. అంటూ తనలో ఆమె మదనపడింది. ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగా పశువులను తోలుకొని పొలానికి వెళ్లింది సదరు మహిళ. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. వెళ్తున్న దారి వెంట బావులను చూస్తూ ఉంది.

ఆమెతో పాటు పదేళ్ల కూతురుతో పాటు.. నాలుగేళ్ల చిన్నారి ఉంది. దగ్గర్లోనే ఆమెకు బావి కనిపించింది. ఇద్దరు పిల్లలను అందులో తోసేసి.. ఆమె కూడా అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలోనే పెద్ద కూతురు, తల్లి అక్కడిక్కడే మరణించగా.. నాలుగేళ్ల చిన్నారి మాత్రం బావి ఇటుకల మధ్య చిక్కి.. ప్రాణాలతో బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.

అత్తతో మొబైల్ విషయంలో గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఛతర్‌పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ శశాంక్ జైన్ వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇలా కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.