సోమవారం భస్మధారణ ఎందుకు చేస్తారో తెలుసా..?

ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజు శివుని పూజించే భక్తులు అందరూ తప్పనిసరిగా విభూదిని ధరిస్తారు. విభూది అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది అని చెప్పవచ్చు. శివుడికి ఇష్టమైన ఈ విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని వేళలా ఆ పరమశివుడు తోడై ఉంటాడని పండితులు చెబుతున్నారు.భస్మధారణ చేయకుండా జపాలు, తపస్సులు చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు కలగవని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మన శరీరంలో 32 చోట్ల భస్మధారణ చేయాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా సోమవారం భస్మధారణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

శిరస్సు, రెండు చేతులు, గుండె, నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మూడు గీతలు భస్మాన్ని ధరించడం వల్ల మన జీవితంలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒక రోజు విహారానికి వెళుతూ తను ధరించడానికి నగలు, ఐశ్వర్యం కావాలని ఆ పరమశివుని అడగగా.. అందుకు శివుడు కొద్దిగా విభూతిని ఇచ్చి కుబేరుడి వద్దకు వెళ్లి విభూతిని ఇచ్చి తనకు కావలసింది తీసుకోమని తెలియజేస్తాడు.

శివుడు చెప్పిన విధంగానే పార్వతీదేవి ఆ విభూదిని తీసుకొని కుబేరుడు దగ్గరకు వెళ్లి ఆ విభూతికి సరిపడ నగలు ఇవ్వాల్సిందిగా కోరుతుంది.ఆ విధంగా విభూదిని త్రాసులో పెట్టి కుబేరుడు ఉన్న ఐశ్వర్యం అంతటిని త్రాసులో ఉంచినప్పటికీ కూడా త్రాసు లేవలేదు. దీనిని బట్టి శివుడు ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన భక్తులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకోసమే శివుని ఐశ్వర్య ప్రదాత అని కూడా పిలుస్తారు. అందువల్ల ఆ పరమశివుని పూజించే భక్తులు సోమవారం భస్మధారణ తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు.