ఇక ఫోన్ పే, గూగుల్ పే అవసరం లేదు.. నేరుగా వోచర్ల ద్వారానే డబ్బులు..

భారత్ లో ఎక్కువ శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయి. అందులో ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మరో విధానాన్ని నేడు (ఆగస్టు 2) సాయంత్రం ప్రదాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. దీనిలో ముఖ్యంగా ఒక క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి ఓ వోచర్ పంపిస్తారు. గూగుల్‌ పే, యూపీఐ, ఫోన్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల వలే ఇ-రూపీ ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫారం కాదు.

ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వీటినే ఇ-రుపీగా భావిస్తారు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి బ్యాంక్, డిజిటల్ యప్ లాంటివి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఈ ఓచర్లను జారీ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. వారికి మనకు వచ్చే డబ్బు ఎంతో తెలియజేసి.. ఫోన్ నంబర్ తో సహా వివరాలను చెప్పాల్సి ఉంటుంది.

అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారు దానికి సంబంధించిన వోచర్ కోడ్ చెబితే రిడీమ్వ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మనకు పంపించి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరికి డబ్బులు చేరాలో వారి అకౌంట్లో పడిపోతాయి. ప్రస్తుతం అమెరికా విద్యావ్యవస్థలో ఈ- ఓచర్ల విధానం అమల్లో ఉంది. పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వవ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.