ముగ్గురు చిన్నారులు అదృశ్యం.. కట్ చేస్తే.. అడవిలో అస్తిపంజరాలు ప్రత్యక్షం.. చివరకు..

ఆగస్టు 18, 2021న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో 10 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అదే రోజు నుంచి ఆ చిన్నారుల తల్లి కూడా కనిపించలేదు. ఆ రోజు ఆ చిన్నారుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా తల్లి కూడా అదే రోజు కనిపించకుండా పోవడంతో ఆమె ఆ పిల్లలను చంపేసి ఎక్కడికో పారిపోయిందని పోలీసులు భావించారు.

తర్వాత కొన్ని రోజులకు పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురి పిల్లల అస్తిపంజరాలు ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ అడవిలో గుర్తించారు. అప్పుడు పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. ఆ పిల్లలను తల్లే హత్య చేసి పారిపోయిందని కేసు కూడా నమోదు చేసుకున్నారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల ఆ అడవిలో అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అడవిలో గొర్రెలను మేపుతుండగా.. చెట్టుకు వేలాడుతూ ఓ కుల్లిపోయిన శవం కనిపించింది. ఆమెను అతడు ఆ పిల్లల తల్లే అని అనుమానించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ పిల్లల తల్లే అని నిర్ధారించారు. వాళ్ల ముగ్గురిని హత్య చేసి.. భయంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటుందంటూ పోలీసులు చెబుతున్నారు.

కానీ వాళ్ల బంధువులు మాత్రం పోలీసులే హత్య చేసి ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆమె చావుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబ పెద్ద కన్నీరుమున్నీరుగా విలపించాడు.