ఏనాడూ గడపదాటని.. రాజకీయాలలో జోక్యం చేసుకొని మా పెద్దమ్మని అవమానిస్తారా: నారా రోహిత్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి పోయాయి.శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి వైఎస్ఆర్ నాయకులు ఎంతో అవమానకరంగా మాట్లాడారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర రాజకీయ నాయకులు స్పందిస్తూ వైసిపి నాయకులు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడు హీరో నారా రోహిత్ ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే నారా రోహిత్ వారి సొంత గ్రామం నారావారి పల్లికి వెళ్లి వారి తాతయ్య నానమ్మల సమాధులకు నివాళులు అర్పించి అక్కడే బైఠాయించి ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి మంచి మనసు ఉన్న వారిని అసెంబ్లీ సాక్షిగా వైసిపి నాయకులు అవమాన పరిచారని అందుకు నిరసనగా తమ పెద్దల సమాధి వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుటుంబంలో ఉన్నటువంటి మా పెద్దమ్మ ఎప్పుడూ కూడా రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకోలేదని ఎప్పుడూ కూడా ఆమె గడప దాటి బయటకు రాలేదని అలాంటి ఆమెపై ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకులకు నోరు ఎలా వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతో అవమానకర వ్యాఖ్యలను ఎదుర్కొన్నప్పటికీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టిడిపి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.ఈ విధంగా నారా భువనేశ్వరికి జరిగిన అవమానానికి పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించారు.